టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

మార్చి నెలాఖరు నుండి అమ‌లు చేస్తాం

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. ప్రస్తుతం టిటిడిలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టిటిడి ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టిటిడి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టిటిడి అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టిటిడి బోర్డు ఆమోదానికి తీసుకు రావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!