చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. తన వయసు 75 ఏళ్లు. కానీ ఆయన ఇప్పటికీ చలాకీగా ఉంటారు. నిత్యం పనిలో నిమగ్నమై ఉంటారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా పాలనా పరంగా నిత్యం చైతన్యవంతంగా ఉంటూనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా వచ్చారు.
ఆయన నేరుగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. 5,555 ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందించారు నారా చంద్రబాబు నాయుడు.
