హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏజ్ పెరిగినా ఇంకా డిమాండ్ ఉన్న నటులలో మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు విక్టరీ వెంకటేశ్. ఈ ఇద్దరూ కలిసి తాజాగా నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. వరుస సినిమాలు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తను ఇప్పటి వరకు తీసిన తొమ్మిది సినిమాలు సక్సెస్ అయ్యాయి. ప్రతి ఒక్కరిని ఈర్ష్య పడేలా చేశాయి. వరుస విజయాలతో నిర్మాతలు పెద్ద ఎత్తున దర్శకుడి అపాయింట్ మెంట్ కోసం క్యూ కడుతున్నారు.
దీంతో విక్టరీ వెంకటేశ్ తన పారితోషకాన్ని పెంచేసినట్లు పెద్ద ఎత్తున టాక్. గత కొంత కాలంగా రూ. 12 కోట్లు ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నాడు. తాజాగా తన చివరి రెండు మూవీస్ సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో మరింత పారితోషకాన్ని రెట్టింపు వేయడం కలకలం రేపింది. ప్రస్తుతం తను నటించాలంటే రూ. 22 కోట్లు ఇవ్వాలంటూ కండీషన్ పెడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తన సినీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ చేసిన మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. దీనికి కూడా దర్శకత్వం వహించాడు అనిల్ రావిపూడి.
