డిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ముందుగా కేంద్ర నీటి జల శక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగానికి సంబంధించి వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. ఈ కీలక మీటింగ్ లో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాస రెడ్డి, ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ తో భేటీ అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి కేంద్ర మంత్రులతో చర్చించడం జరిగిందని చెప్పారు. ఈనెల 15న శివరాత్రి సందర్బంగా రాష్ట్రంలోని శివాలయాలలో , క్షేత్రాలలో భక్తుల రద్దీ పెరిగిందని అన్నారు. ఢిల్లీ నుంచే సీఎస్, రాష్ట్ర మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, అనిత వంగలపూడిలతో సమీక్ష చేపట్టానని తెలిపారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో సమావేశం అయ్యారు.