తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలలో భాగంగా ఆ దేవ దేవుడు, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు ధగధగ మెరుస్తున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి (లక్ష్మి) బంగారు. స్వర్ణ రథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ స్వర్ణర థోత్సవాన్ని దర్శించడం వల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వ శుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం . ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ , కంకణభట్టర్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ముని కుమార్, శ్రీ ధన శేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
