హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు

తిరుమ‌ల : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేద‌న్నారు. ఆ దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్ అంటూ మండిప‌డ్డారు. ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకుందా అని నిల‌దీశారు. హిందూ వ్యతిరేకి అయిన నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు బీఆర్ నాయుడు.

అన్య మతస్తుడవైన నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలిచ్చావా? రాలేదు ఎందుక‌ని, ఆ విష‌యం బ‌హిరంగంగా చెప్పాల‌న్నారు. నీ జీవితంలో నీ భార్య తో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి అంటూ మండిప‌డ్డారు టీటీడీ చైర్మ‌న్. తాను చైర్మ‌న్ గా కొలువు తీరాక తిరుమ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. అన్య‌మ‌త ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేశామ‌న్నారు. నీ అండతో నీ బాబాయ్, భూమన చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని నీ బాధంతా త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావని అర్థ‌మైంద‌ని అన్నారు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీయాలని చూశావంటూ ఫైర్ అయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!