టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు, ప్ర‌ముఖులు

తిరుపతి : టిటిడి అనుబంధ ఆలయాల్లో శ్రీ ప‌రాభ‌వ నామ‌ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకోదండ రామాలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి, శ్రీనివాస మంగాపురం, నారాయణ వనంలలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి స్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నుంచి పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం జ‌రిగింది. అదేవిధంగా శ్రీ సూర్య నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం చేపట్టారు.

తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు. ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామాలయంలో 10.30 నుండి 11.30 గంటల వరకు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

అప్ప‌లాయ‌గుంట లోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 8.30 నుండి 9.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం జరిగింది. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.45 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం శాశ్వతంగా జరిగింది. అదేవిధంగా కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల స్వామి, వాల్మీకిపురం శ్రీ కోదండ రామ‌స్వామి, త‌రిగొండ శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామి, ఇత‌ర అనుబంధ ఆల‌యాల‌లో ఉగాది ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.

Leave A Reply

Your Email Id will not be published!