అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు (ULBs), పట్టణ అభివృద్ధి సంస్థలు (UDAs) పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీల నుండి పూర్తిగా మినహాయింపు మంజూరు చేయబడిందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ ఫారాలకు భవన అనుమతి లేదా లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశు పోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గి వారి జీవనోపాధి మెరుగు పడుతుందని చెప్పారు. మరింత మందికి స్వయం ఉపాధి, సంవృద్ది లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత జూన్ నెలలో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై కూడా ఆరా తీశారు మంత్రి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
