టూరిజం హబ్ గా రాయ‌ల‌సీమ : ఎస్. స‌విత‌

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాయలసీమను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో పెనుకొండ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభించనున్నామని అన్నారు. రాయలసీమలో సాగు, తాగునీటి కల్పనకు కృషి చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ లో ఏర్పాటు చేయనున్నామన్నారు. రూ.450 కోట్లపై నిధులతో వీరన్నకొండపై ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు స‌విత‌. పర్యాటక పటంలో పెనుకొండను నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెనుకొండ పట్టణంలోని తిమ్మరుసు సమాధి వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను మంత్రి సవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు ఎస్. స‌విత‌. ముఖ్యంగా రాయలసీమను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సైతం అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా పెనుకొండ పట్టణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా పలు ప్రాజెక్టులను చేపట్టామన్నారు. వీరన్నకొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కొండ కింద 60 ఎకరాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు మానసిక వికాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపడతారన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రవచనాలు, కృష్ణతత్వ బోధనలు చేస్తారని మంత్రి సవిత తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!