అమరావతి : కూటమి ప్రభుత్వం రాకతో బీసీ బిడ్డల విద్యకు ఆసరాగా నిలిచే హాస్టళ్లు మెరుగైన పనితీరుతో ముందంజలో నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్యకరమైన మెనూ, బోధనలతో రాష్ట్ర స్థాయిలో బీసీ హాస్టళ్లు అగ్రగామిగా నిలిచాయి. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుద్ధమైన తాగునీటి కల్పన, ఆరోగ్య భద్రతతో కూడిన విద్యను అందించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మనస్సును బీసీ హాస్టళ్లు గెలుచుకున్నాయి. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వ ఐవీఆర్ సర్వేలో మిగిలిన సంక్షేమ హాస్టళ్లకంటే బీసీ సంక్షేమ హాస్టళ్లు 78.02 శాతం సంతృప్త స్థాయిలతో ప్రథమ స్థానంలో నిలిచి ఔరా అనిపించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1110 బీసీ బాలురు, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ హాస్టళ్లు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. నిధులు విడుదల చేయక పోవడంతో మరమ్మతులు సైతం నోచుకోలేక పోయాయి.
కనీసం డైట్ బిల్లు కూడా చెల్లించకపోవడంతో బీసీ బిడ్డలు అర్థాకలితో నరకం చూశారు. కాస్మోటిక్ ఛార్జీలు సైతం చెల్లించిన పాపాన పోలేదు. దినదిన గండంగా ఆ అయిదేళ్లు బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులు కాలం నెట్టుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో ఇతర సంక్షేమ హాస్టళ్లతో పాటు బీసీ సంక్షేమ హాస్టళ్లకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా బీసీ బిడ్డల ఆకలి తీర్చేలా రూ.110 కోట్ల మేర డైట్ బకాయిలను చెల్లించారు. నాటి నుంచి ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు. కాస్మోటిక్ ఛార్జీలను సైతం విద్యార్థులకు సకాలంలో చెల్లిస్తున్నారు. 23 నెలల కాలంలో బీసీ హాస్టళ్ల మరమ్మతులు, ఇతర నిర్మాణాల కోసం రూ.100 కోట్లు వెచ్చించారు. రూ.2 కోట్లతో 104 హాస్టళ్లలో విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అందజేయడానికి ఎస్.ఆర్. శంకరన్ రిసోర్స్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో బీసీ బిడ్డలు 85.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.
