తిరుమల : చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మ వారికి టిటిడి తరఫున 2014 సంవత్సరం నుండి శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అమ్మవారిని ప్రార్థించారు. అంతకు ముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. ఏడాదికి ఒక్కసారే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి పరవశంలో మునిగి పోయారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కోట్లాది మందికి ఇష్ట దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అమ్మ వారిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు సీఎం. అంతే కాకుండా టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిత్యం అన్నదానం కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే ఆదేశించామన్నారు నారా చంద్రబాబు నాయుడు.