హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచి పోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచి పోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందిస్తాం అని వెల్లడించారు మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం అని తెలిపారు. జూన్ 1వ తేదీన సీఎం, డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (LIG) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.