తిరుపతి : తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారు దివ్య మంగళ విహారం చేసి భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషునిపై శేష శాయిగా వెలసిన స్వామి వారు అపూర్వ దివ్యకాంతులతో భక్తులను పరవశింప జేశారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుండగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామస్మరణల నడుమ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.
అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు సమర్పిస్తూ, కర్పూర హారతులు ఇస్తూ భక్తిశ్రద్ధలతో స్వామి వారిని సేవించుకున్నారు. గోవింద నామాలతో మారుమోగిన మాడవీధులు ఆధ్యాత్మిక పారవశ్యానికి నిలయంగా మారాయి . శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రంగా సేవలందిస్తూ “శేషశాయి” మహిమను సార్థకం చేస్తున్నాడు. శేషవాహన సేవ ద్వారా “శేషునిలా నిత్యం భగవంతునికి సేవ చేస్తూ ధర్మమార్గంలో నడిచే వారికి దైవానుగ్రహం లభిస్తుంది” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని స్వామివారు భక్తులకు బోధిస్తున్నారని ఆగమ పండితులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోవ రోజు ఆదివారం ఉదయం 7 గం.లకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గం.లకు హంస వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షంచారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
