రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు శ్రీ‌కారం

ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేందుకే నిర్ణ‌యం

అమ‌రావ‌తి : రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం సిద్దాంతం గ్రామంలో జ‌రిగిన ప‌ట్టేదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం అన్నారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామ‌ని తెలిపారు. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశాం అన్నారు. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100తో బదిలీ చేస్తున్నామ‌ని తెలిపారు. అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులకు రూ.1,000 స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే చాలు అని పేర్కొన్నారు. 1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించామ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

9(2) నోటీసుల జారీ సమయంలో కూడా ఈ-కేవైసీ అమలు చేస్తున్నాం అన్నారు సీఎం. 80 శాతం ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతనే గ్రామాలను వెబ్‌ల్యాండ్ 2.0లోకి తీసుకుంటున్నాం అని వెల్ల‌డించారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యం కల్పించిన‌ట్లు పేర్కొన్నారు. తిరస్కరణ అధికారాన్ని తహసీల్దార్ నుంచి ఆర్డీఓ స్థాయికి పెంచామ‌ని అన్నారు సీఎం. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించామ‌ని తెలిపారు. 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను కూడా తొలిగించామ‌న్నారు. అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశాం. కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నాం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!