హైదరాబాద్ : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన పెద్ది మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫస్టాఫ్ కాస్తా పర్వాలేదని అనిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి తలా తోకా లేకుండా తీశాడన్న అపప్రదను మూట గట్టుకున్నాడు దర్శకుడు. ఇందులో కీ రోల్స్ పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్, జగపతి బాబు, శివ రాజ్ కుమార్ . పెద్దిలో చెర్రీ యాక్షన్ కు మంచి మార్కులు పడినా ఇతర పాత్రల విషయానికి వస్తే ఎక్కువగా వాడుకోలేక పోయారన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు జాహ్నవి కపూర్ ను దారుణంగా చూపించాడని దర్శకుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది. తాజాగా పెద్ది మూవీ కలెక్షన్స్ ఆశించిన మేర లేవు. దీనిపై సదరు మూవీ నిర్మాత స్పందించాడు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా రాణిస్తూ ఇప్పటి వరకు రూ. 112 కోట్ల షేర్‌ను సాధించింది. . అయితే, విదేశీ మార్కెట్‌లో ఈ సినిమా ప్రదర్శన చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తోంది. సినిమా రెండో వారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో, ఉత్తర అమెరికాలో దీని ప్రదర్శన తీవ్ర నిరాశజనకంగా మారింది. అక్కడి కొనుగోలుదారులు దాదాపు 40 శాతం నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, ఇది భారతదేశం వెలుపల ఈ సినిమాకు ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బలలో ఒకటిగా నిలిచింది. నిర్మాత సతీష్ కిలారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై బహిరంగంగా స్పందించారు. విదేశాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడాన్ని అంగీకరిస్తూనే, అమెరికా మార్కెట్ ఇప్పటికీ చిత్రనిర్మాతలకు ఒక చిక్కుముడిగానే ఉందని పేర్కొన్నారు. అక్కడి ప్రేక్షకులతో సినిమా ఎందుకు కనెక్ట్ కాలేదో అర్థం చేసుకోవడానికి తమ బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు.
