న్యూఢిల్లీ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 536 సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఐక్యం చేయడానికి దేశ మొదటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పడిన శ్రమ, ఆలోచన అద్బుతం అని అన్నారు. నిజాం, జూనాగఢ్, ట్రావెన్ కోర్ వంటి పెద్ద సంస్థానాలు దేశంలో కలిసేందుకు మొదట ఒప్పుకోకున్నా, వారిని ఒప్పించి దేశాన్ని ఏకం చేయడంలో ఆయన చాలా కృషి చేశారని ప్రశంసించారు. ఆ సమయంలోనే పటేల్ దేశ సమగ్రతను కాపాడుకోవడం దేశానికి మొదటి ప్రాధాన్యం అని చెప్పారన్నారు. ఆయన చెప్పిన మాటను జనసేన పార్టీ అనుసరిస్తుంది. ఆచరిస్తుందని స్పష్టం చేశారు. నేటి రాజకీయాల్లో చాలామంది అధికారం కోసం దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. . దీన్ని కచ్చితంగా జనసేన పార్టీ అడ్డుకుంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల.
దేశానికి చేటు తెచ్చే శక్తులపై రాజీ లేకుండా పోరాడుతాం అని ప్రకటించారు. జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించ లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించాం. ఉన్నతంగా, గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్దంగా ఇచ్చారని ఆరోపించారు. దీంతోనే ఇప్పటికీ విభజన సమస్యలు, ఆస్తుల పంపకం సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను ప్రతిసారీ రెచ్చగొట్టడానికి ఇదే కారణం అవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. దీంతోనే అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. విభజన చేసిన తీరు ఈనాటికీ మానని గాయంగా ఉందన్నారు. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించని తీరునే నేను పదేపదే ప్రస్తావిస్తాను.
మొన్నటికి మొన్న తెలంగాణలో జనసేన ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వలేదు.కొన్ని కళ్ల ముందు జరిగే విషయాలను మనం చిన్నవిగా చూస్తాం. ఏమవుతుందిలే అని వదిలేస్తాం. చలి చీమలు కూడా పాముని చంపేస్తాయనే మాటను పెద్దలు చెబుతుంటారు. అలా చెడు చీమలు అన్ని కలిసి జాతిని, దేశాన్ని నాశనం కోసం ప్రయత్నాలు చేస్తే జనసేన పార్టీ బలంగా దాన్ని అడ్డుకుంటుంది. దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన పార్టీ ఉపేక్షించదు. అలాంటి వారి పట్ల జనసేన గళం బలంగా ఉంటుంది. దక్షిణాదికి చెందిన కొందరు నాయకులు ఢిల్లీని మెడలు వంచుతాం.. వణికిస్తాం అని ప్రగల్భాలు పలుకుతారు. ఢిల్లీ రాగానే కనీసం నోరు కూడా పెగలదు.