ధాన్యం సేక‌ర‌ణ బ‌కాయిలు స‌కాలంలో చెల్లించాం

స్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సేకరణ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674.47 కోట్ల పాత బకాయిలను పూర్తిగా చెల్లించి రైతులకు అండగా నిలిచిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతు శ్రమ దోపిడీకి గురికాకుండా, ఆయన శ్రమ సంపదగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా విస్తృత సహాయం అందించామని తెలిపారు. గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం దాదాపు రెట్టింపు స్థాయిలో రూ.588 కోట్లు ఖర్చు చేసి లక్ష మంది రైతులను ఆదుకున్నామని వివరించారు. తోతాపూరి మామిడి రైతులకు రూ.190 కోట్లు, కడప, కర్నూలు ఉల్లి రైతులకు కొనుగోలు చర్యల కోసం రూ.17.56 కోట్లు, ఉల్లి పంట నష్టపరిహారం కింద హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచి రూ.128.33 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

అదేవిధంగా పొగాకు రైతులకు రూ.240 కోట్లు, కోకో రైతులకు రూ.12 కోట్లు చెల్లించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.500 కోట్లు ప్రతిపాదించామని, అవసరమైతే రైతుల కోసం అదనపు నిధులు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలోని 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంపై రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!