గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయ‌ల‌సీమ‌

స్ప‌ష్టం చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్

అమ‌రావ‌తి : రాష్ట్ర ఉద్యానవన రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. రాయ‌ల‌సీమ‌ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును కేంద్ర సహకారం, ప్రైవేటు పెట్టుబడులతో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో 15.6 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి ఉత్పాదకతలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. మిరప ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు.

పామాయిల్ తోటల విస్తరణకు 2026–27లో రూ.204 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్‌గా అభివృద్ధి చేసి ‘కోకో సిటీ’ ఏర్పాటు ద్వారా చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకు రావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన రూ.1,990.10 కోట్ల ప్రీమియం సబ్సిడీ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయ‌ని, ఆ పాపం గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్లే జ‌రిగింద‌న్నారు. అందుకే జ‌నం జ‌గ‌న్ రెడ్డి పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని ఎద్దేవా చేశారు. ఈ పాపం జ‌గ‌న్ చేసిందే. మొద‌టి రెండేళ్లు ఇచ్చారు అందులో 1990 కోట్లు బ‌కాయి పెట్టారు, మిగ‌తా మూడు ఏళ్లు ప్రీమియం క‌ట్ట‌లేదని మండిప‌డ్డారు. బ‌కాయిని తిరిగి క‌ట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుందని వెల్ల‌డించారు.

Leave A Reply

Your Email Id will not be published!