విద్య తోనే వికాసం..విజ‌యం : ఎస్. స‌విత

విద్యార్థినులకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్లు పంపిణీ

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా : విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, సమాజంలో బీసీ బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఎంజేపీ గురుకుల కళాశాల నిదర్శనమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. మైదుకూరు నియోజకవర్గం లోని ఒనిపెంటలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణ లో జూనియర్ కళాశాల (బాలికలు) ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే ఆశయాలను నేటి ప్రభుత్వం కార్య రూపంలోకి తీసుకు వస్తోందన్నారు. సమాజం లోని వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఈ గురుకుల కళాశాల నిదర్శనమనన్నారు.

ఒనిపెంటలోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకులంలో జరిగింది ఒక విద్యాసంస్థ ప్రారంభం మాత్రమే కాదని, పేద, వెనుకబడిన వర్గాల బాలికల బంగారు భవిష్యత్తు కు వేసిన బలమైన పునాదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి విద్యార్థిని పెద్ద కలలు కనాలి. కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు,సైన్స్ ప్రయోగశాలలు,లైబ్రరీలు, క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని పేర్కొన్న మంత్రి, జేఈఈ,నీట్,క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!