అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులను అమలు చేయాలని ఆదేశించారు. లేకపోతే సపోర్ట్ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అనుమతి తీసుకున్న వారు ఎందుకు గ్రౌండింగ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఎందుకు ఆలస్యం అవుతుందో గుర్తించాలన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ వస్తున్నామన్నారు లోకేష్.
భూ కేటాయింపులు జరిగిన తర్వాత వేగంగా ప్రాజెక్టులు ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు…. అప్పుడే జీఎస్టీ సహా వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు. అప్పుడు ప్రొత్సాహాకాలు ఇవ్వవచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థానిక పరిశ్రమలతో మ్యాపింగ్ చేసి దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుతున్నామని లోకేష్ వివరించారు. ఆంధ్రా యూనివర్సిటీలో రేర్ ఎర్త్ మినరల్స్ పరిశోధనపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ఇటీవల చేపట్టిన రష్యా పర్యటనలో తాను గమనించిన అంశాలను లోకేష్ ప్రస్తావించారు. రష్యాలో క్వాంటం అప్లికేషన్లకు సంబంధించి ఓ ప్రత్యేకమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు అయి ఉందని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, టీజీ భరత్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
