బెంగళూరు : ఐపీఎల్ 2026 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం కొత్తగా హెడ్ కోచ్ ను నియమించే పనిలో పడిందా. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. గత ఏడాది 2025లో సైతం ఆర్సీబీ ఐపీఎల్ కప్పును ఎగరేసుకు పోయింది. రజత్ పాటిదార్ కెప్టెన్ గా కొలువు తీరాక సీన్ మారింది. ఈ తరుణంలో ప్రస్తుతం ప్రధాన కోచ్ అవసరం చాలా ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది. సీఎస్కే జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఏది చెబితే అదే జరుగుతుంది. ఆటగాళ్ల దగ్గరి నుంచి కోచ్ ల ఎంపిక దాకా. సేమ్ సీన్ ఆర్సీబీలో సైతం విరాట్ కోహ్లీ అభిప్రాయాలకు ప్రయారిటీ ఉంటుంది. తను లేకుండా ఎవరినీ తీసుకోరు. ప్రస్తుతం తనతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నాడు భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ , కామెంటేటర్ రవివాస్త్రి. తనను ఆర్సీబీ ప్రధాన కోచ్ గా నియమించాలని సూచించినట్టు టాక్.
ఆర్సీబీ జట్టుకు ప్రధాన కోచ్గా రవి శాస్త్రిని నియమించాలని విరాట్ కోహ్లీ కోరుకుంటున్నారు.
నివేదికల ప్రకారం, కీలక భాగస్వాములతో సమావేశం అనంతరం ఆర్సీబీ యాజమాన్యం ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది. ప్రధాన కోచ్గా ఉన్న ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక వివరాల లోకి వెళితే కోచ్ గా , కామెంటేటర్ గా సక్సెస్ అయ్యాడు రవిశాస్త్రి. తన పూర్తి పేరు రవిశంకర్ జయద్రిత శాస్త్రి . 27 మే 1962 మరాఠా రాజధాని ముంబైలో పుట్టాడు. 1981లో భారత జట్టుకు అరంగేట్రం చేశారు. ఎడమచేతి బ్యాట్స్మన్, కుడిచేతి ఆఫ్-స్పిన్ బౌలర్గా రాణించాడు. 1983 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యుడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుపొందాడు. 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. 2014లో భారత జట్టు డైరెక్టర్గా పని చేశాడు. 2017లో భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. 2021 T20 ప్రపంచకప్ వరకు హెడ్ కోచ్గా కొనసాగారు.
