హెచ్ సీ ఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు

విచార‌ణ చేప‌ట్టాల‌ని లోకాయుక్త‌కు ఫిర్యాదు చేసిన టీసీఏ

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్ సీ ఏ) లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, రూ.600 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ . ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్న వివేక్ వెంక‌ట‌స్వామికి చెందిన కంపెనీకి అక్రమంగా రూ.69 కోట్ల రూపాయలు ముట్ట చెప్పార‌ని ఆరోపించింది. ఈ విష‌యాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. విశాఖ కంపెనీకి హెచ్ సీ ఏ ఖాతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కోట్లు బదిలీ అయ్యాయని ఆరోపించారు టీసీఏ.

నిధుల మళ్లింపుతో పాటు క్లబ్‌ల విక్రయాల్లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నాయని, ఏకంగా 18 క్రికెట్ క్లబ్‌లను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. HCAలో అనధికారికంగా రెండో బ్యాంకు ఖాతాను తెరిచి, దాని ద్వారా టీజీ20 లీగ్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపించింది. 2025లో HCAలో జరిగిన అక్రమాలపై నమోదైన కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులుగా ఉండగా.. పోలీసులు కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్ చేసి, మిగతా నలుగురు బడా బాబులను ఉద్దేశ పూర్వకంగానే వదిలేశారని ఆరోపించింది టీసీఏ.

ఈ నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు గుట్టును, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న వాస్తవాలను సీఐడీ దర్యాప్తులో తేల్చాలని సూచించింది లోకాయుక్త.

Leave A Reply

Your Email Id will not be published!