ఏపీలో గాడి త‌ప్పిన కూట‌మి పాల‌న : జ‌గ‌న్

రెడ్ బుక్ రాజ్యాంగం అమల‌వుతోంద‌ని ఫైర్

క‌డ‌ప జిల్లా : వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా దెబ్బ తిన్న‌ద‌ని అన్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ కృష్ణ‌లంక‌లో సీఐ నాగ‌రాజు చేతిలో సాయి కృష్ణ లాక‌ప్ డెత్ కావ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న‌కు జ‌నం , కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు , అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అడుగడుగునా అభిమానులు అడ్డుకుని ఆప్యాయంగా పలకరించడంతో ఆయన పర్యటన షెడ్యూల్ కంటే ఆలస్యంగా సాగింది.ఉదయం భూమయ్యగారిపల్లె గ్రామంలోని గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన కలశ స్థాపన, సుదర్శన హోమం కార్యక్రమాల్లో వైయస్ జగన్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భూమయ్యగారిపల్లె నుంచి పులివెందులకు బయలుదేరిన వైయస్ జగన్‌కు మార్గమధ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో అభిమానులు, మహిళలు, యువత, వృద్ధులు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద ఆగి పలకరిస్తూ, అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోవాల్సిన ఆయన సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఓ చిన్నారికి అక్షరాభ్యాసం చేయించి ఓనమాలు దిద్దించారు. చిన్నారిని ఆశీర్వదిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరోవైపు యువత పెద్ద ఎత్తున సెల్ఫీల కోసం ఉత్సాహం చూపించగా, వాహనం వెంట యువకులు భారీ సంఖ్యలో ప్రయాణిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేల్పుల సమీపంలో అంబులెన్స్ సైరన్ వినిపించగానే వైయస్ జగన్ తన కాన్వాయ్‌ను వెంటనే పక్కకు ఆపించి రూట్ క్లియర్ చేయించారు. అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన వ్యవహరించిన తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

అనంతరం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను ప్రారంభించారు. పర్యటన సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1800 మంది పార్ట్‌టైమ్ టీచర్లు పనిచేస్తున్నప్పటికీ ఏడాదికి కేవలం ఎనిమిది నెలల వేతనం మాత్రమే అందుతోందని, రెగ్యులర్ ఉద్యోగుల కంటే అధిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వివరించారు.వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్, పార్ట్‌టైమ్ టీచర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. భూమయ్యగారిపల్లె పర్యటన అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కూడా వైయస్ జగన్ పాల్గొన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఓపికగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు, కార్యకర్తల కష్టసుఖాలు వింటూ వారికి ధైర్యం చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!