అమరావతి : రైతులకు చేస్తున్న సంక్షేమాలను చూసి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కు మైండ్ పనిచేయడం లేదని, ఎలాగైనా కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తూన్నాడని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతిలో తిరిగే నైతిక అర్హత వైసీపీ నాయకులకు ఎక్కడుంది? ఐదేళ్లు రాజధానిని నిర్వీర్యం చేసి, రైతుల త్యాగాలను అవమానపరిచిన వారే ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటికి రావొద్దని ఎవరైనా స్పష్టంగా చెబితే, సిగ్గు ఉన్నవాళ్లు మళ్లీ ఆ ఇంటి గడప తొక్కరు. కానీ వైసీపీ నేతలు మాత్రం సిగ్గు, శరం లేకుండా మళ్లీ అమరావతికి వస్తామని చెప్పడం ప్రజలను అవమాన పరచడమే తప్పా మరోటి కాదన్నారు. అమరావతి పాకిస్థాన్లో ఉందా? ఆంధ్రప్రదేశ్లోనే ఉందని వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు తెలియలేదా? అని ప్రశ్నించారు.
రాజధానిని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుని, ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఒక్కరోజైనా మనుషుల్లా గౌరవించారా? వారి కన్నీళ్లు, ఆవేదన, త్యాగాలను పట్టించుకున్నారా? పార్లమెంట్లో సైతం అమరావతికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడని వారు ఇప్పుడు రైతుల ప్రేమ కోసం వస్తున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. అమరావతి రైతుల ఓపికకు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. ప్రజల ఆగ్రహానికి వైసీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, యూనివర్సీటి వీసీ సత్యన్నారయణ, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
