అమరావతి : గత ఐదేళ్లలో రాష్ట్రంలో రక్తపాతం పారించి.. పరిశ్రమలను బెదిరింపులు, కమిషన్ల కోసం వేధించడం వల్ల అనేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించింది ఏపీ కూటమి సర్కార్. కొలిమిగుండ్ల ప్రాంతంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ గతంలో వెనక్కి వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అదే ప్రాంతంలో ఆల్ట్రాటెక్‌తో పాటు రామ్కో సిమెంట్స్ రెండో యూనిట్ ఏర్పాటవుతోందని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగానే దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో భూవివాదాలు, ల్యాండ్ టైటిల్ చట్టం, రాజకీయ వేధింపులు, దౌర్జన్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని ఆరోపించారు.
గతంలో రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించిన తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం కూడా శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీకి గట్టి తీర్పు ఇచ్చారని, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. రాయలసీమలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానవన రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా నిరంతరం పారిశ్రామికవేత్తలను కలుస్తూ రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాయలసీమను “రతనాల సీమ”గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
