అమరావతి : కూటమి ప్రభుత్వంలో రాయలసీమ రతనాల సీమగా మారుతుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమను కరువులు, వలసలకు నిలయంగా కాకుండా పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యానవన అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండు సంవత్సరాల కాలంలో రాయలసీమలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టడం ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత 24 నెలల్లో సుమారు 240 పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల ద్వారా రూ.5.33 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమకూరాయని చెప్పారు.
రాష్ట్రానికి వస్తున్న మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు రాయలసీమ ప్రాంతానికే దక్కుతోందని చెప్పారు. ఈ పెట్టుబడుల ఫలితంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. అలాగే తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు తీసుకు వచ్చామని తెలిపారు. ఈ యూనిట్‌ను ఏడాది వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో రూ.15,800 కోట్ల పెట్టుబడితో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటవుతుందని చెప్పారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక రక్షణ రంగ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 7,500 ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పడతాయని తెలిపారు. రానున్న రోజుల్లో పుట్టపర్తిలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు, కడప జిల్లాలో అదానీ సంస్థ ఆధ్వర్యంలో రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీ ప్రాజెక్టులు రూపు దిద్దుకుంటున్నాయని వివరించారు.
