రాష్ట్రంలో ఎక్క‌డా ఎరువుల కొర‌త లేదు

స్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాలను కాపాడేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. శాస్త్ర‌వేత్త‌ల‌ సిఫార్సుల మేరకే ప్రాంతాల వారీగా ఎరువుల సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే ఈ యాప్ ద్వారా 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ సేవలను మూడు లక్షలకుపైగా కౌలు రైతులు వినియోగించు కోవడం ఆనందంగా ఉంద‌న్నారు. భూమి ఆరోగ్యం కాపాడాలంటే సమతుల్య ఎరువుల వినియోగం తప్పనిసరని పేర్కొన్నారు. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా దిగుబడులు, నాణ్యత రెండూ మెరుగు పడతాయని మంత్రి సూచించారు.

ఆధునిక సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాడిప‌రిశ్ర‌మ‌ను కూడా రైతులు ప్రోత్స‌హించాల‌ని సూచించారు అచ్చెన్నాయుడు. వర్జీనియా పొగాకు ధరల అంశంపై టోబాకో బోర్డు, వ్యాపారులతో చర్చించామని, రైతులకు నష్టం కలగకుండా కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో (FCV – Flue Cured Virginia) వ‌ర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యానవన పంటలకు దేశ, విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. గ‌త ఏడాడి హెచ్‌డీ బ‌ర్లీ పొగాకు రైతుల‌కు అండ‌గా ఉంటూ ప్రభుత్వం ముందుకు వచ్చి రూ. 273 కోట్ల సాయాన్ని రైతుల‌కు అందించిందని గుర్తు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!