2 లక్షల మందిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి : లోకేష్
ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు మార్పించాలి
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులను మార్చడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు రెండు లక్షల మంది విద్యార్థులను ఆకర్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. తాడేపల్లిలో ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించే కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్, ప్రభుత్వ విద్యా సంస్కరణలు ప్రభుత్వ విద్య నాణ్యతను పెంచడం , ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు నారా లోకేష్.
అకడమిక్ పనితీరు ఆధారంగా ‘షైనింగ్ స్టార్స్’గా గుర్తించబడిన మొత్తం 55 మంది పదవ తరగతి విద్యార్థులు, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులకు రూ. 30,000 నగదు బహుమతి, పతకం , ధృవీకరణ పత్రం అందజేయగా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పతకాలు అందించారు. విద్యార్థులను అభినందిస్తూ, వారి విజయాలు ప్రభుత్వ విద్యాసంస్థల ప్రతిష్టను తిరిగి నిలబెట్టాయని లోకేష్ అన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి వారి పనితీరు సానుకూల సంకేతంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని (Parent-Teacher Meeting) నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. విద్యను వ్యవసాయంతో పోల్చిన ఆయన, శాశ్వత ఫలితాలను సాధించడానికి నిరంతర కృషి, సహనం అవసరమని అన్నారు. పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ‘డ్రీమ్ వాల్స్’ ‘గ్రాటిట్యూడ్ వాల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నారా లోకేష్.
