అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్తా అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించే సంస్కృతికి కూటమి ప్రభుత్వం పూర్తిగా చరమగీతం పాడిందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా ఏకంగా రూ.7.66 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను క్లియర్ చేసి గ్రౌండింగ్‌కు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కల్పించబోయే ఉద్యోగాలను ఆధార్‌తో అనసంధానం చేస్తున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి టి.జి భరత్ పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ,ఆహార శుద్ధి రంగాలలో సాధించిన చారిత్రక విజయాలను సుదీర్ఘ వివరణలతో మీడియా ముందుంచారు.
రాష్ట్రంలో భూ కేటాయింపుల ప్రక్రియను పారిశ్రామికవేత్తలకు అత్యంత సులభతరం చేస్తూ ల్యాండ్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఆవేదన చెందారు టీజీ భరత్. గతంలో ఒక పరిశ్రమ స్థాపించాలంటే అర ఎకరం భూమి కోసం కూడా నెలల తరబడి క్యాబినెట్ చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఆ విధానాన్ని రద్దు చేస్తూ 50 ఎకరాల లోపు ల్యాండ్ అలాట్‌మెంట్ ఫైల్స్ ఇకపై ఏపీఐఐసీ క్లియర్ చేసేలా జీవో తెచ్చామన్నారు. ఈ సరళీకరణ వల్ల పరిశ్రమలకు విజయవంతంగా భూ కేటాయింపులు పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని పనులు ప్రారంభించకుండా లాక్ చేసి పెట్టుకుంటే ప్రభుత్వం ఊరుకోదని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలోనే 900 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
