తాడేపల్లి గూడెం : రాష్ట్రంలో కూటమి పాలన బక్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి . వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీలను ఉద్దేశించచి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమని, వాటి కోసం గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుందని ఆరోపించారు జగన్ రెడ్డి. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంకా డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారని మండిపడ్డారు జగన్ రెడ్డి. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడని, జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడని దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని ఆరోపించారు జగన్ రెడ్డి. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని ఫైర్ అయ్యారు. ఘోరమైన అవినీతి జరిగిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అటు అమరావతి నిర్మాణంలోకూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు జగన్ రెడ్డి.