ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీలో రాబోయే కాలంలో సాగు నీటి స‌మ‌స్య లేకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఒంగోలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని చెప్పారు. త‌న అధ్యక్షతన ఉమ్మడి ప్రకాశం జిల్లా డి.ఆర్.సి. సమావేశం ప్రకాశం భవనంలో జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రకాశం, ఇరు జిల్లాల ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ – అనుబంధ శాఖలు, రోడ్డు భవనాలు, నీటిపారుదల రంగాలపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రస్తావించిన అంశాలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇరు జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో చెప్పారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాకు పూర్తిస్థాయిలో అధికారులను కేటాయించనందున ప్రస్తుతం ఇరు జిల్లాలకు కలిపి డీ.ఆర్.సీ. సమావేశం పెట్టామన్నారు. తదుపరి సమావేశం ఆయా జిల్లాలలోనే వేరువేరుగా ఉంటుందన్నారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినందున తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీళ్లు ఇష్టారాజ్యంగా వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తామన్నారు. హార్టికల్చర్ హబ్ గా మార్కాపురం జిల్లాను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని, రైతులకు అవసరమైన పరికరాలను, స్ప్రింక్లింగ్ లను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.

వెలుగొండ ఫలాలను ప్రజలు సత్వరం పొందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయా విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించాలని చెప్పారు. రిజర్వు ఫారెస్ట్ అధికారులు కేంద్రం పరిధిలో ఉన్నాము కదా అని రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తే కుదరదని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల పరస్పర మార్పిడి, స్థానిక గిరిజనులకు ఉద్యోగ కల్పనలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని అన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!