అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టి సీమ డెల్టాతో పాటు రాష్ట్రంలో విలువైన సంపద సృష్టికి కారణమైందని అన్నారు. పట్టి సీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని, ఏడాదిలో పట్టి సీమ పూర్తి చేసి కృష్ణాడెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీదని పేర్కొన్నారు సీఎం. 80 టీఎంసీలతో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించమని తెలిపారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని నాడు పట్టి సీమ నిర్మిస్తుంటే కొందరు విమర్శించారు. పట్టి సీమ, ఒట్టిసీమ అన్నారు. విమర్శలు పట్టించుకుని ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేస్తే కృష్ణా డెల్టా ఏమయ్యేదోనని వాపోయారు. విమర్శలు పట్టించుకోకుండా రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం అని ప్రకటించారు.
గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీల వరద జలాలను తీసుకు వచ్చాం అన్నారు సీఎం. పట్టి సీమకు చేసిన ఖర్చుతో కృష్ణా డెల్టా మొత్తం స్థిరీకరణ జరిగిందన్నారు. ఎకరాకు రూ.1200 ఖర్చు అవుతోంది. వనరులు వృధా కాకుండా రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నాం అన్నారు. వచ్చే వరద జలాలను సముద్రానికి వదిలేసి ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవటం తెలివైన పని అనిపించుకోదు. పట్టి సీమ నీటితో కృష్ణా డెల్టాలో రైతులు బంగారం పండిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి తరలింపు కారణంగానే శ్రీశైలంలో కృష్ణా నీటిని పొదుపు చేసి రాయలసీమకు నీరందింస్తున్నాం అని తెలిపారు సీఎం. రాష్ట్రంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
