నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి : లోకేష్
దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన
అమరావతి : నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించాలని కోరారు ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం అన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం అని పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… దాల్మియా సిమెంట్స్ కడప ప్లాంట్ లైన్–2 విస్తరణకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు కేవలం ఒక తయారీ యూనిట్ విస్తరణ గురించి మాత్రమే కాదు.. విశ్వాసాన్ని మరింత విస్తరించే రోజు. వ్యాపారంలో మొదటి పెట్టుబడి అవకాశాలపై నమ్మకంతో వస్తుంది. రెండో పెట్టుబడి అనుభవంపై నమ్మకంతో వస్తుందన్నారు లోకేష్.
ఇప్పటికే ఉన్న ఒక సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించినప్పుడు అది గట్టి సందేశాన్ని ఇస్తుందన్నారు. రాష్ట్రంపై విశ్వాసం, పాలనపై విశ్వాసం, భవిష్యత్తుపై విశ్వాసం. ఈ రోజు దాల్మియా భారత్ చేపడుతున్న విస్తరణ కూడా అలాంటి విశ్వాసానికే నిదర్శనం అని పేర్కొన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా రాష్ట్రంపై తమ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిన దాల్మియా భారత్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. పునీత్ జీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం బెంగళూరు నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. నేడు దేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచారు. అయితే నన్ను మరింతగా ప్రేరేపించేది ఏమిటంటే.. భారతదేశంలోని తొలి డిజిటల్ స్టార్టప్‌లలో ఒకటైన JobsAhead.com సహ స్థాపకులుగా వ్యవహరించడం. మీరు కేవలం ఒక వారసత్వాన్ని స్వీకరించలేదు. దానికి నాయకత్వం వహించే ముందు… మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నారు. అదే ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ఈ రోజుకీ దాల్మియా భారత్‌ను ముందుకు నడిపిస్తోందని ప్రశంసలు కురిపించారు.
