పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల

పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి : భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్టు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

దీనిపై స్పందించిన సీఎం అన్ని పీపీపీ ప్రాజెక్టులనూ సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని, ప్రతీ ప్రాజెక్టు వద్దా ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు సీఎం. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్ధంగా వినియోగించు కోవాలని సూచించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్ధంగా నడిపేందుకు అవసరమైన మెకానిజమ్ సిద్ధం చేయాలని సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను కూడా భాగస్వాములను చేసి వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద పబ్లిక్ టచ్ పాయింట్ల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్ధిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు రూ.178 కోట్ల వీజీఎఫ్‌ను కేంద్రం ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీలకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని.. ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్ధిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!