క్రీడా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ : సీఎం
ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు.ఇటీవల విజయవంతంగా ముగిసిన ‘సీజన్-1 TG-20 క్రికెట్ లీగ్’లో విజేతలుగా నిలిచిన ‘హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్’ జట్టు సభ్యులు ఎంసీఆర్ హెచ్ఆర్డీ లోని భూమి పెవిలియన్ వద్ద ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జట్టు సభ్యులను అభినందించి, వారికి చెక్కులను అందజేశారు.
క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తెలంగాణ కోసం ప్రత్యేక క్రీడా విధానాన్ని ప్రవేశ పెట్టామని , క్రీడా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు TG20 ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. TG20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో వారు దేశ ప్రతిష్టను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఏకాగ్రత అత్యవసరమని, ఎంచుకున్న రంగం పట్ల గౌరవం , ఆసక్తి ఉండాలని ముఖ్యమంత్రి క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. కిరణ్ , ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.