హైదరాబాద్ : హైడ్రా ఆక్రమదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఏకంగా భారీ విలువ కలిగిన స్థలాన్ని రక్షించింది. బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని బంజారా చెరువు పక్కన ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. దీని అంచనా విలువ రూ. 600 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా పేర్కొంది. నిజాం కాలం నాటి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్లో గుర్తించబడని ప్లాట్‌గా మిగిలి పోయిన ఈ భూమి, కోర్టు వివాదంలో చిక్కుకుంది. చాలా మంది ఈ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారు . స్థానికులు, బంజారాహిల్స్ లేక్ కన్జర్వేషన్ కమిటీ సభ్యులు ‘ప్రజావాణి’ ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేసి, దీనిని పరిరక్షించి పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. నిజాం కాలం నాటి లేఅవుట్ నుండి ఈ ప్లాట్‌ను ఎవరూ కొనుగోలు చేయనప్పటికీ, పక్కనే ఉన్న వ్యక్తులు దీనిని తమదిగా చెప్పుకుంటూ ఆక్రమించారని, ప్రస్తుతం వారి వారసులు దీని కోసం కోర్టులో పోరాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెరువు పక్కన ఉన్న ఈ భూమి కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని, చెరువు డంపింగ్ యార్డులా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని పరిరక్షించడంతో పాటు, దానిని అభివృద్ధి చేయాలని వారు కోరారు. దీనికి అనుగుణంగా హైడ్రా సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులతో చర్చలు జరిపింది. కోర్టు వివాదం పరిష్కారమయ్యే వరకు ఎవరూ ఆక్రమించకుండా ఉండేందుకు, దాని చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కేసు వివరాలను సేకరిస్తూనే హైడ్రా అక్కడ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. అంతే కాకుండా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మామిళ్ల గ్రామం పరిధిలోని వెంకటద్రి నగర్లో 800 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా పరిరక్షించింది. 1975లో 7.20 ఎకరాల విస్తీర్ణంలో 118 ప్లాట్లతో ఒక లేఅవుట్ రూపొందించ బడింది, అందులో 800 చదరపు గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చి, లేఅవుట్ సృష్టించిన వారు వాటిని విక్రయించారు. పార్కు భూమిని ఎలా విక్రయిస్తారని అప్పట్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.