కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తేల్చండి
స్పష్టత ఇవ్వాలని కోరిన కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ దిప్కే
న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయక పోతే తాము కఠిన వైఖరి అవలంబించాల్సి వస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు శనివారం పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని, అయితే ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన పార్టీ ప్రధాన డిమాండ్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కార్యకర్త అశుతోష్ రంకా చెప్పారు. పరిహారం , చట్టపరమైన అంశాలపై నిన్నటి సమావేశం సానుకూల స్పందనను ఇచ్చిందన్నారు. దీనిపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని వెల్లడించారు. ఆ లిఖిత పూర్వక ఒప్పందం ఈ రోజే అందుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే మా ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎటువంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోరని మీడియా కథనాలు సూచిస్తున్నాయని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. .ఆయన రాజీనామా చేయకపోతే, ప్రభుత్వం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి, ఎందుకంటే ఈ సమావేశాలను కొనసాగించడంలో అర్థం లేదు. అప్పుడు మేము మా తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటామని నొక్కి చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే తాము కఠిన వైఖరిని అవలంబించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులపై విద్యా శాఖ తీసుకున్న చర్యలపై స్పందించారు. విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని రంకా అన్నారు . తాము వివరాలను పరిశీలిస్తాం, కానీ అంతిమ బాధ్యత విద్యాశాఖ మంత్రిదేనని నొక్కి చెప్పారు.
