యువ‌త చ‌ట్ట స‌భ‌ల్లోకి రావాలి : రేవంత్ రెడ్డి

వ‌యో ప‌రిమితిని 25 నుంచి 21 ఏళ్ల‌కు త‌గ్గించాలి

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. ఇదే స‌మ‌యంలో ఇందుకు గాను శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయో పరిమితిని తగ్గించాలని ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదిస్తామని ప్రకటించారు.

నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం . యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో జెన్ జీకి మద్దతుగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ అధికారులు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. 21 ఏళ్లకు శాసనసభ, లోక్‌సభకు, అలాగే 25 ఏళ్లకు రాజ్యసభకు పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభలు వేదికగా యువత గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగినట్టుగా పార్లమెంట్‌లో చట్ట సవరణ కోసం ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు. యువతే ఈ దేశ భవిష్యత్తు, వారికేం కావాలో నిర్ణయించుకునే అధికారం కూడా యువతకు ఉండాలని, వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. దేశంలో యువకులు మార్గనిర్ధేశకులు కావాలన్న ఆలోచనతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావడానికి వీలుగా చట్ట సవరణ ద్వారా పోటీ చేయడానికి కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించారని ప్రస్తావించారు.

జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 సంవత్సరాలు నిండితే చట్టసభలకు పోటీ చేయడానికి అవకాశం ఉందని, సింగపూర్‌లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మన దేశంలో ఆ పరిస్థితి ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు సీఎం. శాసనసభలో తీర్మానం చేసి ప్రధానమంత్రి గారికి పంపించడమే కాకుండా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. అలాగే 21 ఏళ్లు నిండిన వారే అత్యంత కీలకమైన విద్యా శాఖ, ఐటీ శాఖలకు మంత్రులైతే ఈ దేశ ముఖచిత్రం మారుతుందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!