కోట్లాది ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కాపాడిన హైడ్రా

త్వరితగతిన పరిష్కారాలను చూపామ‌న్న క‌మిష‌న‌ర్

హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా కోట్లాది రూపాయ‌లు విలువ చేసే ప్ర‌భుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతోంది. ఇప్ప‌టికే 3 వేల‌కు పైగా ప్ర‌భుత్వ భూముల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ స‌ర్కార్ జూలై 19న 2024లో ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి నేటి దాకా తీవ్ర ఒత్తిళ్ల‌ను ఎదుర్కొని విలువైన‌, కోట్లాది రూపాయ‌ల స్థ‌లాల‌ను కాపాడింది .ఈ రెండేళ్ల కాలంలో, ఇది అనేక కార్యకలాపాలను చేపట్టింది. అనేక సమస్యలను పరిష్కరించింది. మరెంతో మందికి భరోసా కల్పించింది. చెరువుల పునరుద్ధరణ కావచ్చు.. వరద కాలువల విస్తరణ లేదా పూడికతీత పనులు కావచ్చు. హైడ్రా నగరవాసులకు అండగా నిలిచింది . వరద ముప్పును నివారించింది. అందుకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.జూబ్లీహిల్స్ నుండి వచ్చే వరద నీరు కృష్ణానగర్‌ను ముంచెత్తేది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద నడుము లోతు వరకు నీరు చేరి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించేది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న వర్షపు నీటి పైప్‌లైన్లు పూడికతో పూర్తిగా నిండి పోవడం వల్ల ఈ వరద సమస్యలు తలెత్తేవి. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉండేది. పైప్‌లైన్ల నుండి పూడికను తొలగించడం ద్వారా ఇప్పుడు అక్కడ వరద ముప్పు తప్పింది. కృష్ణానగర్ నుండి శ్రీనివాస నగర్ మీదుగా అమీర్‌పేట్ వరకు ఉన్న డ్రైనేజీల నుండి పూడికను తొలగించడం వల్ల, ఇప్పుడు వరద నీరు సజావుగా ప్రవహిస్తోంది.

బేగంపేట నుండి సికింద్రాబాద్ మార్గంలో ఉన్న ‘పట్నీ డ్రైన్’ (కాలువ)పై ఆక్రమణలను తొలగించడం ద్వారా, దాని ఎగువన ఉన్న 8 కాలనీలకు పొంచి ఉన్న వరద ముప్పును నివారించింది. 40,000 కుటుంబాలు , 1.60 లక్షల మంది ప్రజలను వరద సమస్యల నుండి రక్షించిన‌ట్లు చెప్పారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. పట్నీ డ్రైన్ వాస్తవానికి 72 అడుగుల వెడల్పు ఉండేది, కానీ పట్నీ వద్దకు చేరే చోట అది 10 అడుగులకు కుదించబడి ఉండేది. హైడ్రా అక్కడ ఉన్న అన్ని ఆక్రమణలను పూర్తిగా తొలగించి, దానిని పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించింది. ఫలితంగా వరద ముప్పు నివారించామ‌న్నారు. బాగ్ లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ పరిస్థితిని గమనిస్తే.. వర్షాలు పడినప్పుడు అక్కడి ప్రజలు ఇబ్బందులు పడేవారు. సమీపంలోనే హుస్సేన్ సాగర్ వరద కాలువ ఉండేది. ఆ కాలువకు అనుసంధానంగా ఉన్న మార్గాన్ని ఒక ఆక్రమణదారుడు మట్టితో పూడ్చేశాడన్న ఫిర్యాదు హైడ్రాకు అందగానే, అది వెంటనే రంగంలోకి దిగింది. ఆ కాలువను పునరుద్ధరించి, వరద ముప్పును నివారించింది. మియాపూర్‌లోని గుర్నాథ్ చెరువు , ఖాజాగుడలోని ఖాజాగుడ చెరువు వద్ద, అలాగే మల్కం చెరువు ఇన్‌లెట్ల (నీరు వచ్చే మార్గాల) వద్ద పేరుకు పోయిన భారీ పూడికను హైడ్రా తొలగించింది.

Leave A Reply

Your Email Id will not be published!