హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను సన్నద్దం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ కు అత్యధికంగా ప్రయారిటీ ఇస్తోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమమ్మల నాగేశ్వర్ రావు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనను , చేపడుతున్న చర్యలను రైతు నాయకులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీలను ఆదేశించాలని కోరారు. అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రిని ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా తక్కువ ధరలకు సరఫరా చేయాలని విన్నవించారు. అలాగే ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ వైర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు మంత్రికి.
రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి మండలంలో కనీసం ఒక ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, కార్మికుల కొరతను అధిగమించేందుకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అధికారులు, కంపెనీలు, రైతులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రాంతం దేశంలోనే ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఆయిల్ పామ్ అధిక ఆదాయం అందించే పంట అని, దీనికి మార్కెటింగ్ సమస్యలు లేవని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేలా ఆయిల్ పామ్ కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
