తెలంగాణలో ఘనంగా ఖేలో ఇండియా’ క్రీడల నిర్వహణ

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఖేలో ఇండియా క్రీడ‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర మ‌త్స్య‌, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. త‌న‌ను క‌లిసిన వారిలో మంత్రి శ్రీ‌హ‌రితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎ.పి. జితేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి ఉన్నారు. తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ క్రీడలను కేటాయించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ,కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు మంత్రి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పంపిన ఆహ్వాన లేఖను ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి అందజేసింది. డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 22 వరకు మొత్తం 12 రోజుల పాటు తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ క్రీడలను అత్యంత ఘనంగా , ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని శ్రీహరి పేర్కొన్నారు. ఎటువంటి లోపాలకు లేదా విమర్శలకు తావు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరతారని ఆయన తెలిపారు ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అన్ని వర్గాల సహకారంతో ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తామ‌ని, ప్రముఖ క్రీడా కేంద్రంగా తెలంగాణ కీర్తిని మరింత పెంచుతాం అని శ్రీ వకిటి శ్రీహరి అన్నారు

Leave A Reply

Your Email Id will not be published!