మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి

ఎకో పాండ్ , వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి

హైద‌రాబాద్ : మార్కెట్ల‌లో ఆర్డీ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విబ్ జి రామ్ జి కింద ఎకో పాండ్లు , వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు, ఎఈఓ ల దగ్గర రిజస్ట్రీ చేసుకునే విధంగా రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుత పంట పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఇప్పటి వరకు రైతులకు సబ్సిడీపై ఎన్ని వ్యవసాయ యంత్రాలు అందించారనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులకు సేవలందించేందుకు అవసరమైన మేరకు ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమ పథకాల అమలులో సిబ్బంది కొరతను కారణంగా చూపించే పరిస్థితి ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని అధికారులను ఆదేశించారు.

మార్క్‌ఫెడ్‌కు మంజూరైన 65 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలను వరి అధికంగా పండించే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల హాజరుపై రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అన్ని శాఖల్లో అమలు చేసి, ప్రతి ఉద్యోగి హాజరును అందులో నమోదు చేయాలని ఆదేశించారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకే తరహా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ను మంత్రి ఆదేశించారు. దీనివల్ల పరిపాలనా వ్యవస్థ మరింత సరళంగా మారడంతో పాటు పర్యవేక్షణ సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మిగిలి పోయిన మొక్కలను వెంటనే విక్రయించి, వచ్చే నెలకు కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలు లేవనే సమాధానం రాకూడదని, రెండు మూడు రోజుల్లోనే వారికి మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నర్సరీలు లక్ష్యం కంటే రెండింతల మొక్కలను పెంచాలని, ఖర్చు ఎంతైనా నాణ్యమైన విత్తనాలను సమకూర్చి అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలని ఆదేశించారు. సంవత్సరానికి 2 లక్షల ఎకరాలు లక్ష్యం పెట్టుకొని అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. అన్ని శాఖల వద్ద ఉన్న భూములు, ఆస్తుల వివరాలను తెప్పించుకుని, నర్సరీలకు భూమి అవసరమైతే ఇతర శాఖల ఖాళీ స్థలాలను లీజు ప్రాతిపదికన వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సెక్రటరీని ఆదేశించారు. డ్రిప్ కంపెనీలతో మాట్లాడి ఆయిల్‌పామ్ కంపెనీలే రైతులకు నేరుగా డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు.

ఆయిల్‌పామ్ మిల్లుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ట్రయల్ రన్స్ ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన గడువులు పూర్తయిన తర్వాత కూడా పనులు కొనసాగుతున్నాయని చెప్పడం సరికాదన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతుల్లో మరింత ఉత్సాహం కలుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని విజయ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మిడ్‌డే మీల్స్ కార్యక్రమాలకు అవసరమైన కూరగాయలను ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచే కొనుగోలు చేసేలా, అలాగే వంట నూనెగా విజయ ఆయిల్‌ను వినియోగించే అంశంపై హరేకృష్ణా చారిటీ ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!