100 రోజుల్లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులతో రికార్డ్
అరుదైన ఘనతను స్వంతం చేసుకుని విజయ్ సర్కార్
చెన్నై : సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే కూటమి సర్కార్ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఏకంగా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు సీఎం. పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు అధిక విలువ కలిగిన రంగాలపై రాష్ట్రం దృష్టి సారిస్తోంది. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులు, లైసె న్సులు , ‘నో-అబ్జెక్షన్’ సర్టిఫికెట్ల జారీకి 21 రోజుల గడువును తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. నిర్ణీత సమయంలోగా అవసరమైన అనుమతులు జారీ చేయకపోతే, ఆ దరఖాస్తులు ఆటోమేటిక్గా ఆమోదించ బడినట్లుగా పరిగణించ బడతాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన తెలిపారు. ‘వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ 2026’లో మాట్లాడారు. రూ. 200 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడితో కూడిన లేదా కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించే భారీ ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయడానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘తమిళనాడు ఇన్వెస్టర్ ప్రమోషన్ కమిషన్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
తమిళనాడులో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగ మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. తాము పెట్టుబడిదారులను కేవలం మమ్మల్ని నమ్మమని అడగడం లేదు, మా పనితీరుపై మేమే ఒక గడువును విధించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ‘తమిళనాడు సింగిల్ విండో పోర్టల్’ను బలోపేతం చేస్తుందని ,అతుకులు లేని డిజిటల్ ఆమోద ప్రక్రియ వైపు అడుగులు వేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సులో రూ. 67,542 కోట్ల విలువైన 97 ప్రాజెక్టులకు సంబంధించి కొత్తగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి; వీటి ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నామన్నారు కీర్తన ఈ హామీలతో కలిపి, తొలి 100 రోజుల్లో ఆకర్షించిన మొత్తం పెట్టుబడులు రూ. 1 లక్ష కోట్లను దాటుతాయని , 1.2 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆమె చెప్పారు.
