అమరావతి : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న ‘విజన్–2047’ లక్ష్యాలను చేరుకునే క్రమంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందుకోసం రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. విజయవాడ గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సవిత శానిటేషన్ మెటీరియల్‌తో కూడిన శానిటరీ కిట్లను వర్కర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టళ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. గతంలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు చేపట్టి అవసరమైన మౌలిక వసతులను కల్పించామన్నారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు, విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్లు, కిటికీలకు నెట్లు, విద్యార్థుల సౌకర్యార్థం హ్యాంగింగ్ హుక్స్ వంటి వసతులను ఏర్పాటు చేశామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. వసతి గృహాల్లో పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు 1,100 కొత్త టాయిలెట్లను నిర్మించామని మంత్రి తెలిపారు. వాటి నిర్వహణ, పరిశుభ్రత కోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 మంది శానిటేషన్ వర్కర్లను నియమించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బందిని కేటాయించామని తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, ఇతర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 11 రకాల వస్తువులతో కూడిన శానిటరీ కిట్లను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సవిత తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వంటి ప్రత్యేక సేవలను కూడా అందిస్తున్నామని చెప్పారు.
