హైదరాబాద్ : వనపర్తి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తూడి మేఘారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకున్నాడని ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో చిన్నారెడ్డి మేఘారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఇదిలా ఉండగా కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు చిన్నారెడ్డి. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రవర్గంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పార్టీలో తెలంగాణ కోసం వనపర్తిలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ వాదిగా ముద్రపడ్డారు. ముందు నుంచీ వివాద రహితుడిగా పేరు పొందిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఉన్నట్టుండి నోరు పారేసుకున్నారు. ఆపై తను నమ్ముకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
మేఘారెడ్డి ఢిల్లీలో డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఆధారాలతో సహా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రమ శిక్షణ కమిటీ కీలక నివేదిక తయారు చేసింది. పార్టీకి సమర్పించింది. చిన్నారెడ్డితో పాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ ఇద్దరూ ఇచ్చిన సంజాయిషీలను పట్టించుకోలేదు. కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిపై వేటు వేసింది. ఆపై కొండా సురేఖను బర్తరఫ్ చేసింది. ఈ సందర్బంగా తనపై వేటు వేయడంపై స్పందించారు చిన్నన్న. తనకు ఏ పాపం తెలియదని, ముందు నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నానని, కానీ తనను నిట్ట నిలువునా ముంచిందని వాపోయారు.
