రేవంత్ రెడ్డి పాల‌న బ‌క్వాస్ : ఈట‌ల రాజేంద‌ర్

రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న ప‌క్క‌దారి ప‌ట్టింది

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైద‌రాబాద్ లోని షామీర్ పేట్ లో జ‌ర‌గిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో కీల‌క స‌మ‌వేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో తెలియ‌ద‌ని అన్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను అప్ప‌నంగా అమ్మ‌కానికి పెట్టార‌ని, ఈ హ‌క్కు మీకు ఎవ‌రు ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు. ధర మారినప్పటికీ, విధానం మాత్రం మారలేదు.. వారు ‘భూభారతి’ని తీసుకువచ్చి, దానినే అమలు చేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి ఒక ‘మినీ ఇండియా’ లాంటిదని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఇక్కడ అన్ని రాష్ట్రాలు , ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు.

వందలాది కాలనీలు ’22A’ నిషేధిత జాబితాలోకి చేర్చ‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. కేవ‌లం రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని అన్నారు ఎంపీ. ప్రపంచ చరిత్ర హిట్లర్‌ను ఒక రాక్షసుడిగా గుర్తుంచుకుంటే, తెలంగాణ మాత్రం రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో త‌ప్ప‌క గుర్తు పెట్టుకుని తీరుతుంద‌న్నారు. చివరికి వారు పీ అండ్ టి కాలనీ, మహేంద్ర హిల్స్‌ను కూడా ’22A’ జాబితాలో చేర్చ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అవి అమ్ముడు పోకుండా లేదా బ్యాంకులకు బదిలీ కాకుండా చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. ఇది ‘తుగ్లక్ తరహా పాలన’ అని ప్రజలు అంటున్నారని అన్నారు.

తాము ’22A’ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని అడగడం లేదు. కేవలం పేదల భూములు , ఇళ్లను ఆ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనివల్ల 90 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అన్నారు. ఆ అసంబద్ధమైన మాటలు కట్టిపెట్టి, నిషేధాన్ని ఎత్తి వేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ నెల 5 , 6 తేదీలలో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా నిర్వహిస్తారని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!