అమరావతి : పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు.
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజతో పాటు అమ్మ వారికి అష్టోత్తర శత నామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మీ వ్రత మహిమను వివరిస్తూ వ్రత కథను భక్తులకు వినిపించారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ , మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలి రావడంతో వేద పండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింప జేశారు.
