న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని కోరుతూ రంజిత్ బజాజ్ కోర్టును ఆశ్రయించారు. ఏఐఎఫ్ఎప్ తన రాజ్యాంగం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్, 2025’కు అనుగుణంగా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ‘రిట్ ఆఫ్ మాండమస్’ లేదా ఇతర తగిన ఆదేశాలను కోరారు. ఫుట్‌బాల్ నిర్వాహకుడు ,పారిశ్రామికవేత్త అయిన రంజిత్ బజాజ్ ఏఐఎఫ్ఎఫ్ కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని, నిర్ణీత కాలవ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల ప్రకటనతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను కోర్టు నిర్ణయించే గడువులోగా పూర్తి చేయాలని కూడా ఆయన కోరారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫెడరేషన్ వ్యవహారాలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు లేదా దీర్ఘకాలిక, ఆర్థిక లేదా వెనక్కి తీసుకోలేని పరిణామాలు కలిగించే నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుత ఏఐఎఫ్ ఎఫ్ కార్యవర్గాన్ని నిరోధించే మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేయాలని పిటిషనర్ కోరారు.
న్యాయ ప్రయోజనాల దృష్ట్యా కోర్టు సముచితమని భావించే ఇతర ఉత్తర్వులను కూడా ఈ పిటిషన్ కోరుతోంది. ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్, 2025’ కింద కొత్త ఎన్నికల విధానానికి మారుతున్న నేపథ్యంలో తన ఎన్నికలను వాయిదా వేయాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో బజాజ్ ఈ అభ్యర్థన చేశారు. AIFF ఇప్పటికే NSGA నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఆమోదించి, రాజ్యాంగపరమైన సవరణలను పూర్తి చేసిందని, కాబట్టి ఎన్నికలను మరింత వాయిదా వేయడానికి ఎటువంటి సమర్థన లేదని బజాజ్ తన పిటిషన్‌లో వాదించారు. అలాగే ‘ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్’ కేసులో జూలై 17 న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ప్రస్తావించారు; జాతీయ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర సంఘాల అనుకూలత (నిబంధనల అమలు)ను ముందస్తు షరతుగా పరిగణించలేమని ఆయన వాదించారు.
