అసెంబ్లీలో కీలక సమస్యలపై చ‌ర్చ‌లేవీ..?

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్

హైద‌రాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ నిప్పులు చెరిగారు. ప్ర‌జా దేవాల‌యంగా భావించే శాస‌న స‌భ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ప్రజలు తమ ప్రైవేట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పరిష్కారం కాని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు, కాంగ్రెస్ , బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండూ ప్రజలను కష్టాల్లోకి నెట్టాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు , విస్తృతమైన భూ వివాదాల వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ప్రజలు తమ ప్రైవేట్, వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారని వాపోయారు.

తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ప్రజలను ప్రభావితం చేసే కీలక సమస్యలపై సరైన చర్చ జరగడం లేదన్నారు పాయ‌ల్ శంక‌ర్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రజలు నిరంతరం ఇబ్బందులు పడుతూనే ఉన్నార‌ని పేర్కొన్నారు ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్. . ప్రతిపక్షం సభలో ఈ సమస్యలను పదేపదే లేవనెత్తుతున్నప్పటికీ, ప్రభుత్వం బాధ్యతను తప్పించుకుంటూ సమాధానాలు ఇవ్వడంలో విఫలమవుతోందని శంకర్ పేర్కొన్నారు. దాదాపు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళ‌న చెందారు. కొందరు చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడగా, మరికొందరు చదువు పూర్తయినా తమ సర్టిఫికెట్లను పొందలేక పోతున్నారని మండిప‌డ్డారు. బీజేపీ అసెంబ్లీలో ఈ సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నా, ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమవుతోందని అన్నారు ఎమ్మెల్యే.

Leave A Reply

Your Email Id will not be published!