అమరావతి : జగన్ రెడ్డి ఏపీని సర్వ నాశనం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రధానంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని ‘వాటర్ మ్యాన్’ అని ఊరికే అనలేదని అన్నారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతే అందుకు నిదర్శనమన్నారు. వైసీపీ హయాంలో మైక్రో ఇరిగేషన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో సుమారు రూ.1,100 కోట్ల బకాయిలు పేరుకు పోయాయని, వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్, మైక్రో ఇరిగేషన్ విస్తరణకు పెద్దపీట వేసి, ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని వెల్లడించారు. ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించు కోవడం, భూగర్భ జలాలను సంరక్షించడం, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
రాయలసీమకు తాగు, సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించకుండా ఉంటే సీమ ప్రజలు హర్షిస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. రాయలసీమను ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దే లక్ష్యంతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో సుమారు రూ.40 వేల కోట్లు, ప్రైవేట్ రంగంలో మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తం రూ.1 లక్ష కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించి హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వ్యవసాయం, సాగునీరు, ఉద్యానవన రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
